9/05/2012

About Sri Maha Ganapathi in Rug veda ?

Triad Hindu Temple
ఋగ్వేదంనాటి మరుద్దేవతలే ఇప్పటి గణపతి ?
గణపతిని పార్వతీదేవి నలుగుపిండితో రూపొందించి, ఊపిరి పోసిందనే కధ ప్రచారంలో ఉంది. ఆ కధనం సంగతి ఎలా ఉన్నా, మన గణపయ్యను పోలిన అనేక గణపతులు దేవతలుగా ఉండేవారని ఋగ్వేదం చెబుతోంది. ఏ పని ప్రారంభించినా ముందుగా వినాయకుని పూజించాలి, లేకుంటే విఘ్నాలు కలుగుతాయి కదా... ఇలా విఘ్నాలు కలిగించే దేవతలు ఇంకా ఉండేవారు. ఈ దేవతాగణం కేవలం విఘ్నాలు కలిగించడమే కాదు, హాని కూడా చేసేది. విఘ్నేశ్వరునికి, ఈ దేవతా గణానికి ఎన్నో సారూప్యాలు ఉన్నాయి. ఆ వివరాలు, పూర్వాపరాలు ఏమిటో తెలుసుకుందాం.

ఋగ్వేదంలో మరుత్తులు లేదా మరుద్దేవతలు పేరుతో దేవతల బృందం ఉంది. ఈ గణం రుద్ర సంతానం. ఋగ్వేద రుద్రుడు అంటే పురాణకాలం నాటి శివుడు. శివ పుత్రుడే గణపతి. ఋగ్వేదంలో రుద్రుని పుత్రులైన మరుత్తులు బృహస్పతి, ఇంకా ఇంద్రుని లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు.


రుద్ర సంతానం అయిన మరుత్తులు ఏదో రకంగా విఘ్నాలు కలిగించగలరు. అలాగే విఘ్నాలను తొలగించగలరు. మరుత్తుల వల్ల హాని కలిగే అవకాశం ఉంది. ఈ గణానికి కనుక ఆగ్రహం వస్తే గొడ్డలి, వజ్రాయుధం, ఈటె, ధనుర్బాణాలతో హింసిస్తారు. ఈ రుద్ర సోదరుల శక్తి అపారం. అడవులను నేలమట్టం చేయగలరు. పర్వతాలను పెకిలించగలరు.


మరుత్తులు విఘ్నాలు మాత్రమే కల్పిస్తారా, చెడు మాత్రమే చేస్తారా అంటే కాదు. ఈ దేవతలు కౄరులే కాదు, దయామయులు కూడా. రుద్ర సోదరుల్లో అనేక సద్గుణాలు ఉన్నాయి. మరుద్దేవతలను సానుకూలం చేసుకుంటే గొప్ప శక్తిసంపదలను ఇస్తారు. విఘ్నాలను నివారిస్తారు. శత్రువులను చిన్నాభిన్నం చేస్తారు. భక్తుల క్షేమం, శ్రేయస్సు కోరుకుంటారు. ఎల్లవేళలా ఆదుకుంటారు. రుద్ర సోదరులు తమను నమ్మినవారికి కంటికి రెప్పలా కాపలా ఉంటారు. తల్లి బిడ్డను సంరక్షించినట్లు నిరంతరం భక్తులను కాపాడతారు. వారికి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూసుకుంటారు.


మరుద్దేవతలను రుద్రులు అని కూడా అంటారు. చిత్రం ఏమిటంటే, ఈ రుద్ర సంతానంలో సోదరులంతా సమానమే. పెద్ద, చిన్న, అన్న, తమ్ముడు అనే తేడా లేదు. వీరి జన్మస్థలం, నివాస స్థలం ఒకటే. వీరు స్వర్ణ కాంతితో మెరిసిపోతుంటారు. వజ్రాయుధం, ఈటె, గొడ్డలి, ధనుర్బాణం వీరి ఆయుధాలు.


మరుద్దేవతల మహిమ అనన్యసామాన్యమైంది. రుద్ర సోదరుల శక్తిసామర్ధ్యాలకు ఎల్లలు లేవు. బృహస్పతి మరుద్గణాల అధిపతి. అందువల్ల బృహస్పతికి, మరుద్దేవతలకు కొన్ని పోలికలు ఉన్నాయి. బృహస్పతి ఆయుధం గొడ్డలి. వీరి ఆయుధాల్లో గొడ్డలి ఒకటి. బృహస్పతి విఘ్నాలను నివారిస్తాడు. బృహస్పతి మేధోసంపన్నుడు, గొప్ప వాక్చాతుర్యం ఉంది. మరుద్దేవతలు కూడా బృహస్పతి లాంటివారే.


అనేక మార్పులు చేర్పులు జరిగి, ఋగ్వేదంలో ప్రసిద్ధమైన మరుద్దేవతలు కాలగర్భంలో కలసిపోయారు. బృహస్పతి, బ్రహ్మణస్పతులు నవగ్రహాల్లో కలిసిపోయారు. ఇంద్రుడు దిక్పాలకుడు అయ్యాడు. భయానకంగా కనిపించే రుద్రుడు మంగళకరుడు అయిన శివుడిగా రూపొందాడు.


కాలక్రమంలో మరుద్దేవతల గుణాలను సంతరించుకుని కొత్త దేవత రూపొందింది. ఆ దేవతే గణపతి. గణపతిలో రుద్ర, మరుత్తుల గుణాలు, బృహస్పతి, మరుత్తుల ఆయుధాలు, ఇంద్రుని శక్తి కలిసి ఉన్నాయి. కొందరు దేవతలు కలిసి మరో కొత్త దేవతగా రూపొందడానికి గణపతి ఒక ఉదాహరణ.

No comments:

Post a Comment